G-GB3W50CLMM

LOGILI BOOK

LOGILI BOOK

LOGILI BOOK

లోగిలి సాహితీ వేదిక ఆవిర్భావం అస్తిత్వం కార్యాచరణ


 ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. కానీ, ఎక్కడో ఒక దగ్గర మొదలైతే పెట్టాలి కదా... అందుకే నా కవితా ప్రస్థానం తొలినాళ్ళను స్మరించుకుంటూ మొదలు పెడుతున్నాను.  నాది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని  కొల్లిపర. 2004లో నేను తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు, నా పిచ్చి రాతలను కవిత్వం అంటారని, అది సాహిత్యంలో భాగమని కూడా తెలియని  రోజులవి. నా జీవితంలో నేను మొట్టమొదటి సారిగా కలం పట్టి  రాసిన కవితను  సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు విశ్లేషించి,  ప్రోత్సహించి నన్ను కవిత్వం వైపు నడిపించారు. ఆయనే నాకు తొలి సాహితీ గురువు. వారి మాటలు నన్ను ఎంతగా ప్రభావితం చేశాయంటే నా జీవితంలో కవిత్వం ఓ భాగమయ్యేలా.. ఇప్పటికీ అనుకుంటాను..

 నేను ఆయనకు ఏకలవ్య శిష్యుణ్ణి అవునో కాదో తెలియదు కానీ‌, ఆయన మాత్రం నాకు గురు ద్రోణులే!! అలా సాగుతున్న నా సాహితీ ప్రస్థానం పుష్కర కాలం గడిచాక నా కవితల్ని పుస్తక రూపంలోనికి తీసుకు రావాలని ఆశ కలిగింది. అయితే... ముద్రణకు అయ్యే ఖర్చు భరించే స్తోమత లేదు. ప్రచురణ కోసం దాతల సహకారం అందేంత గొప్ప పరిచయాలు నాకు లేవు. కానీ, నా సాహిత్యం పదిమంది చదవాలన్న సంకల్ప మాత్రం ఉంది. నా సాహిత్యాన్ని పుస్తక రూపం తీసుకురావటానికి దమ్ములైతే ఉన్నాయి గానీసొమ్ములు మాత్రం లేవు. ఈ సందిగ్ధంలో నేనుండగా...


 సహకార ముద్రణ ఆలోచన వచ్చింది. ఒక్కడినే అయితే ఆర్థికంగా భరించలేక పోవచ్చు, అదే నాలాంటి పది మందిని కలుపుకుంటే, పుస్తక ముద్రణ తేలిక అవుతుందని ఆలోచించి అయితే ఇది ఒక వ్యక్తి పేరుతో కాకుండా ఒక సంస్థ పేరుతో ప్రజా బాహుళ్యంలోకి వస్తే బాగుంటుందని భావించి సాహితీ సంస్థను నెలకొల్పాలని సంకల్పించుకుని "లోగిలి సాహితీ వేదిక"గా నామకరణం చేశాను. నాలాంటి ఇంకొందరు ఔత్సాహిక కవుల కోసం వెతుకులాట మొదలు పెట్టాను. ఫేస్ బుక్ వేదికగా ప్రకటన జారీ చేశాను. చాలా తొందరగా స్పందన వచ్చింది. లబ్దప్రతిష్టులు, వర్ధమాన, ప్రవర్ధమాన  కవులు, కవయిత్రులు వెరసి 21 మంది స్పందించి నా ఆలోచనను బలపరిచి నాకు తోడుగా నిలిచారు.నాతో పాటు చేయి చేయి కలిపి నా సంకల్ప సిద్ధికి తమ వంతు ఆర్ధిక, హార్ధిక సహాయ సహకారాలు అందించారు.అలా అందించిన ప్రతి కవి మరియు ప్రతి  కవయిత్రి ప్రతి పాఠకుని వరకు చేరాలని ఆశించి మా గురుతుల్యులు, లోగిలి సాహితీ వేదిక గౌరవ అధ్యక్షులు శ్రీ నారాయణ స్వామి గారు ఆత్మీయ వచనములు వ్రాసి ఈ నా సంకలనానికి "విశ్వమంతా విస్తరించాలని.." అంటూ నామకరణం చేశారు. 


 ముందుమాట ఎవరితో రాయించాలా... అనే మీమాంసలో నేనుంటే, నా హృదయానికి దగ్గరగా అనిపించిన కవి, నా శ్రేయోభిలాషి "దిగంబర, గరళమ్, తప్తస్పృహ" వంటి గొప్ప కవితా సంపుటుల సృష్టికర్త, అఖిల భారతీయ సాహిత్య పరిషత్  జాతీయ అవార్డు గ్రహీత, వెండితెరకు, బుల్లితెరకు పాటలు రాస్తున్న గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ అన్నయ్య మాత్రమే నాకు గుర్తొచ్చారు. ఒక్కొక్కరు ఐదు కవితల వంతున 21 మంది కవులు మరియు కవయిత్రులచే విరచించబడిన 105 కవితలకు ముందుమాట రాయమని ఆయనను అడిగాను. ఆయనకు తీరిక ఉండదని తెలుసు. తీరిక చేసుకొని రాయటానికి కూడా కుదరదు అనీ తెలుసు. కాని యువకులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే మల్లిక్ అన్న నాకోసం, మా పుస్తకం కోసం తీరిక చేసుకొని మాకు తెలిపిన సమయానికంటే ముందే తన ముందుమాట రాసిచ్చేశారు. అది చదివి నేను చాలా ఆనందపడ్డాను. అపూర్వమైన విశ్లేషణ అది. దానిని మాటల్లో అభివర్ణించలేను...


 పుస్తక ముద్రణ పూర్తయింది. అద్భుతంగా వచ్చింది పుస్తకం. నా పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని నేను పడ్డ శ్రమ మొత్తం మర్చిపోయాను. ఇప్పుడు నా పుస్తక ఆవిష్కరణ జరగాలి. ఎక్కడ చేయాలి అనే సందిగ్ధంలో నేనుంటే తిరుపతిని వేదిక చేయమనే సూచన వచ్చింది. ఎక్కడ గుంటూరు జిల్లా కొల్లిపర, ఎక్కడ తిరుపతి. తెలిసిన చోటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని. అలాంటిది అక్కడ ఎవరూ తెలియదు. ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించింది లేదు. అలాంటిది ఎలా నిర్వహించగలను, నా వల్ల అయ్యే పనేనా.. అంటూ నేను భయపడుతూ ఉండగా.. అంతా ఆయన భుజస్కంధాలపైకి ఎత్తుకొని కార్యక్రమం జయప్రదం చేశారు నారాయణ స్వామి గారు. ఈ కార్యక్రమ వేదిక ఎంపిక, అతిథుల ఎంపిక వారే చేశారు. విశ్వం విద్యాసంస్థల ప్రాంగణాన్ని వేదికగా ఇచ్చిన శ్రీ విశ్వనాథ రెడ్డి గారు,  మా విశిష్ట అతిథి రూరల్ కమ్యూనిటీ డెవలెప్ మెంట్ సొసైటీ, పుంగనూరు అధ్యక్షులు శ్రీ జాన్ గారు, మా సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ద్రావిడ విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి  శ్రీ విశ్వనాథ అరుణాచలం గారు, ఆత్మీయ అతిథులు వి. కోటకు చెందిన ప్రముఖ కవి రఘుపతి గారు, తిరుపతికి చెందిన శ్రీ దూబగుంట రామకృష్ణ గారు మరియు పుస్తకం లోని కవులు, కవయిత్రులతో జూన్ 16 2019న "లోగిలి సాహితీ వేదిక" ఆవిర్భావం మరియు "విశ్వమంతా విస్తరించాలని..." కవితా సంకలన ఆవిష్కరణ ఘనంగా జరిగాయి.


 విద్యార్థులు, యువత సాహిత్యం వైపు ఆకర్షితులు కావడానికి రేపటి తరం కవిత్వం దిశగా నడవటానికి తర్వాత రోజుల్లో కవితల పోటీలు నిర్వహించి 15 డిసెంబర్ 2019న  శ్రీకాకుళం వేదికగా " సిక్కోలు సిరామృతం" పేరుతో ఒక జాతీయ కవి సమ్మేళనం నిర్వహించి రేపటి తరం సాహితీ కిరణాలను ఆ వేదికపై సత్కరించుకున్నాం. ఆ కార్యక్రమ నిర్వహణ కూడా లోగిలి పుట్టినిల్లు కొల్లిపరకు దూరంగానే జరిగింది. ఈ సభకు గురజాడ విద్యాసంస్థల ప్రాంగణం వేదిక కాగా ప్రముఖ కవి శ్రీ పులఖండం శ్రీనివాసరావు గారి అధ్యక్షతన భద్రాచలవాసి శత శతక కవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా, జాతీయ అవార్డు గ్రహీత, బాల సాహిత్య కవి శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు మరియు గురజాడ సంస్థల అధినేత శ్రీ జి. వి. స్వామి నాయుడు గారు విశిష్ట అతిథులుగా, శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ కలెక్టర్ శ్రీ సవరమ్మ గారు, బంగార్రాజు గారు, సినీ దర్శకులు ఏ కే రహీం గారు,మాకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రముఖ రచయిత శ్రీ భమిడిపాటి గౌరీ శంకర్ గారు, కవి ఈవేమన గారు మరియు విచ్చేసిన కవులు కవయిత్రులతో తెలుగు తల్లికి దీప ప్రజ్వలన చేసి ప్రారంభించుకున్నాం. ఈ సదస్సుకు ఆంధ్ర, తెలంగాణ నేగాక మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుండి కూడా 130 మందికి పైగా తెలుగు కవులు హాజరయి సభను దిగ్విజయం చేశారు.


ఇలాంటి కార్యక్రమాలు చేయడాలని, వానిని విజయపథం వైపు నడిపించడానికి కేవలం ఒక మనిషి వలన సాధ్యం కాదు. కుటుంబ సభ్యుల, జీవిత భాగస్వామి సహకారం కావాలి. ముఖ్యంగా నా తల్లిదండ్రులు, అత్తమామలు,  నాలో సగం అయిన నా జీవిత సహధర్మచారిణి ధీరజ, నేను నిరాటంకంగా సాగించే సాహితీ సేవకు కారకులు. 

ముఖ్యంగా శ్రేయోభిలాషులైన పెద్దల ఆశీస్సులు, సలహాలు కూడా అందాలి. పై తెలిపిన వారందరి సహాయ సహకారాలతోపాటు, లోగిలి బృందం ప్రధాన కార్యదర్శి షణ్ముఖ రావు, ఉపాధ్యక్షులు హేమంత్ కుమార్, కోశాధికారి అనిల్ కుమార్ మరియు క్రియాశీలక సలహాదారు మోలాలీ జాలె ల శ్రమ, సహాయం ఎంతో ఉంది. ఇంత మంది సారధులు, వారధులు కలిస్తేనే సాధారణ ఆంగ్ల ఉపన్యాసకుడు అయిన ఈ ఫణీంద్ర నేడు మీ ముందు మహారథి గా నిలబడగలిగాను.  నా ప్రతి కార్యక్రమ విజయానికి తమ అండదండలు అందించిన వీరందరికీ పేరు పేరునా నా మనఃపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. భవిష్యత్తు లో లోగిలి సర్వతోభిముఖాభివృద్ధినిగాంచి... అక్షరామృత వర్షిణిలో అభిషిక్తీకరించాలని, మనసులను సదా ఆనందింజేయాలని.మీ

మహారథి


VISWAMANTA VISTARINCHAALI

VISWAMANTA VISTARINCHAALI

VISWAMANTA VISTARINCHAALI ---విశ్వమంతా విస్తరించాలి ---Rs. 110/- ----190 పేజీలుమహారథి ఫణీంద్ర ---13-25/A-బ్యాంకు బజార్                                        కొల్లిపర (పో) (మం)---గుంటూరు జిల్లా --                   ఆంధ్రప్రదేశ్---522304 --                   సెల్ః 888 5050 959 --లోగిలి సాహితీ వేదిక ఆధ్వర్యంలో  21వంది కవులతో 105 కవితలతో వెలువడిన విశ్వమంతా విస్తరించాలని.. కవితా సంకలనం..

₹110.00₹ Ex Tax: ₹110.00₹

Showing 1 to 1 of 1 (1 Pages)